Sunday, November 23, 2008

ఈ కవిత రాయకపోతే ఒక మంచి కాన్సెప్టన్నా కన్యగా ఉండిపొయ్యేది.


ఈ రోజు ఆంధ్రజ్యోతి వివిధ లో కవిత కెమిస్ట్రీ ఆఫ్ టియర్ స్ వచ్చింది.
రచయిత కొప్పెర - వీరి ఇతర రచనలేమీ నేను చదవలేదు.

కన్నీళ్లను, రక్తాన్నీ ఒక చోటకు తెచ్చి కవిత రాయాలన్న ఆలోచన భేషుగ్గా ఉంది. ఈ కాన్సెప్టే ఆవకాయ - బిర్యానీ సినిమా టైటిల్లా అదిరింది. కానీ పోలిక అక్కడితో ఆయిపోలేదు, నవతరంగం ఆవకాయ - బిర్యానీ రివ్యూలో చెప్పినట్టు ఈ సినిమా తియ్యకపోతే కనీసం ఒక మంచి టైటిల్ అయినా మిగిలి ఉండేది. అలాగే ఈ కవిత రాయకపోతే ఒక మంచి కాన్సెప్టన్నా కన్యగా ఉండిపొయ్యేది.

కవితలో ప్రవాహం లేదు.

కవితలో గాఢత లేదు.

కవితలో సంక్లిష్టత లేదు.

కవితలో సూక్ష్మత లేదు.

కవితలో లక్ష్యం లేదు.

కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్ అనే ఆంగ్ల టైటిల్ అసలీ కవితకు అవసరమా? వాడుకలోని ఆంగ్ల పదాలను కవి వాడుకోవటం వేరు, లేదా కొత్త భాషా పదాలను కవి వాడుకోవటం వేరు. కానీ ఇలా వ్యాకరణ సహితంగా ఆంగ్ల వాక్యాన్ని తెలుగు రచనలో దించడం ఎంతవరకూ సమంజసం? ఒక పక్క తెలుగులో భాషా బోధన జరగాలంటారు, మరో పక్క తెలుగు మాత్రమే వస్తే పనికి రాని వాడిగా వాతావరణాన్ని సృష్టిస్తారు. కవి భవిష్యత్తును శాసించే శక్తియుక్తులు కలవాడు, ఆ అధికారాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత అర్థం చేసుకోవాలి.
బ్లడ్‌ ఈజ్‌ థిక్కర్‌ దేన్‌ వాటర్‌ -- ఇటువంటిదే మరో ప్రయోగం.

సూది గుచ్చుకున్నపుడు, బ్లేడు కోసుకున్నపుడు
రక్తం ఉబుకుతుంది
రక్తం ఉరలుతుంది
కత్తివేటుకు రక్తం ఉవ్వెత్తున లేచిపడుతుంది
రక్తం కళ్లచూడాలంటే
రాయి కర్ర సూది బ్లేడు కత్తి బుల్లెట్‌
ఏదో ఒకటి ప్రయోగింపబడాలి

ఈ 7 లైన్లు చదువుతుంటే, సినిమాల్లో కవులపై వ్రాసిన జోకు అనే అనుమానం వస్తుంది. అంత పేలవంగా ఉన్నాయి. ఇదే భావాన్ని కవి ఇంకా కొంచెం అభ్యాసం చేసి వ్రాసి ఉండవలసింది.

కవిత ఎక్కువగా ఇలాగే పేలవంగా ఉంది.

అసలు జ్యోతిలో దీన్ని ప్రచురించటానికి స్వీకరించటం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది.

వివిధలో నాలుగు కవితాక్షరాలు వెతుక్కుందామలుకునే నన్ను నిరాశపరచింది.




-----------------------------------


కెమిష్ట్రి ఆఫ్‌ టియర్స్‌
అవును
రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి
బ్లడ్‌ ఈజ్‌ థిక్కర్‌ దేన్‌ వాటర్‌
నిజమే కావచ్చు
బట్‌ నాట్‌ థిక్కర్‌ దేన్‌ టియర్స్‌
సూది గుచ్చుకున్నపుడు, బ్లేడు కోసుకున్నపుడు
రక్తం ఉబుకుతుంది
రక్తం ఉరలుతుంది
కత్తివేటుకు రక్తం ఉవ్వెత్తున లేచిపడుతుంది
రక్తం కళ్లచూడాలంటే
రాయి కర్ర సూది బ్లేడు కత్తి బుల్లెట్‌
ఏదో ఒకటి ప్రయోగింపబడాలి
అందరి రక్తం ఎర్రగానే ఉండడంతో
అందరూ ఒకటేనని ఒకప్పుడు చెప్పేవాళ్ళు
నిజమే రక్తం మనందరినీ ఒకటి చేసింది
ఒకే గొడుగు కిందకు తెచ్చింది
అందరిలోను ఒకే రక్తం ప్రవహిస్తోంది
ఎవర్ని కొట్టినా అదే రక్తం ప్రసరిస్తోంది
అమాయకుణ్ణి గుచ్చినా అదే రక్తం
నియంతను నరికినా అదే రక్తం
తెల్లవాణ్ణి నల్లవాణ్ణి
డబ్బులున్నవాణ్ణి లేనివాణ్ణి
మంచివాణ్ణి చెడ్డవాణ్ణి
ఎవర్ని ఎవర్ని నరికినా
అదే రక్తం చిందుతున్నప్పుడు
మనిషికి రక్తం అస్తిత్వాన్నిస్తున్నదే కానీ
మనిషితనానికి చిరునామా అవుతున్నదా
మంచి రక్తం చెడు రక్తం
అంటూ ఉంటాయి కానీ
మహామనిషి రక్తం
మామూలు మనిషి రక్తం అంటూ ఉంటాయా
అందుకే
రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి
లోలోపలి మనిషితనానికి
బాహ్యరూపం కన్నీళ్ళు
ఆరడుగుల మనిషికి ప్రాగ్రూపం కన్నీళ్ళు
తెలుసా
మనిషిలో కన్నీళ్ళ రహస్య తటకాలున్నాయి
నదీ మూలాల్లాంటి కన్నీటి చెలమలున్నాయి
ఒకరు రాయి విసరనక్కరలేదు
మరొకరు కత్తి దూయనక్కరలేదు
గాయ పరచేదైనా అనునయించేదైనా
చిన్నమాట చాలు
కళ్ళదోనెల్లో నీళ్ళు కదలాడుతాయి
చదువుతున్న పుస్తకంలో
చిన్న సందర్భం చాలు, కన్నీళ్ళకి
చూస్తున్న తెరమీద
ఒక్క సన్నివేశం చాలు, కన్నీళ్ళకి
కిటికీలోంచి కనిపించే
ఒక జీవిత శకలం చాలు, కన్నీళ్ళకి
జీవితంలో ముంచి తీసిన
కవిత్వ చరణం చాలు, కన్నీళ్ళకి
నిజానికి ఇవి కూడా అక్కరలేదు
ఒక్క ఊహ
వణికించి తొణికించే ఒక్క ఊహచాలు, కన్నీళ్ళకి
గుండె బరువెక్కి
ఒక దుఃఖపు గుటక గొంతును పట్టేసి
కన్నీళ్ళు తొణికిసలాడాయా, నువ్వు మనిషివి
కళ్ళు వర్షించినపుడు
మనిషి నల్లమబ్బుల ఆకాశం
కళ్ళల్లోకి నీళ్ళు తోడుకున్నపుడు
మనిషి జలవనరులున్న సస్యక్షేత్రం
మనలోంచి మనం తవ్వుకునే
తెల్లటి మణులు కన్నీళ్ళు
రక్తంలా కన్నీళ్ళు అనుక్షణం తయారు కావు
రక్తంలా కన్నీళ్ళు అణువణువూ ప్రవహించవు
మనిషికి ఇన్ని కన్నీళ్ళుంటాయనీ
ఉండాలని ఎవరు చెప్పగలరు
రక్తం చిందడానికి భౌతిక చర్య సరిపోతుంది
కళ్ళు చిప్పిల్లాలంటే
రసాయనిక చర్య జరగాల్సిందే
మనుషులందర్నీ ఒకటిగా కలిపిన రక్తం
కణసముదాయాలుగా విడిపోయింది
పాజిటివ్‌గా నెగిటివ్‌గా పాలిపోయింది
కన్నీళ్లు మాత్రం వర్షపు నీళ్లలా
స్వచ్ఛంగా ఉండిపోయాయి
యుద్ధ బీభత్స ప్రతీక - రక్తం
యుద్ధ విధ్వంస స్మ ృతి - కన్నీళ్లు
యుద్ధంలో రక్తం గడ్డకట్టుకుపోతుంది
స్మ ృతుల్లో కన్నీళ్లు స్రవిస్తూనే ఉంటాయి
హృదయం రక్తంలో తేలుతూ ఉంటుంది కానీ
దాని ఉనికిని చాటేది మాత్రం కన్నీళ్ళే
రక్త హీనత ఉన్నట్టే
దుఃఖ లేమి కూడా ఉంటుంది
రక్తాన్ని ఎక్కించగలరు కానీ
కన్నీళ్ళ నెవరైనా ఎక్కించగలరా
- కొప్పరి

Pasted from <http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2008/nov/24-11vividha5>